మనల్ని వదిలి వెళ్లినా.. గద్దరన్న మన మధ్యలోనే ఉన్నాడనే అనుభూతి.. గద్దరన్న రాసి, పాడిన పాటలు వింటుంటే.. మా కోసం మళ్లీ పుట్టుకొచ్చాడనే అనిపించింది. ఆట పాటలతో 6 గంటల పాటు ఆ హాలంతా హోరెత్తుతుంటే.. గద్దరన్న మన మధ్యలోనే ఉన్నాడు.. ఎవరు చెప్పారు చనిపోయాడనిపించేలా సాగింది హైదరాబాద్‌లో ఆర్టీవీ, తొలివెలుగు సంయుక్తంగా నిర్వహించిన గద్దర్ సంస్మరణ సభ. ఐదున్నర దశాబ్ధాలకు పైగా తన ఆట, పాటలతో ఎంతోమందిని చైతన్యవంతులను చేసిన ప్రజా కవి గద్దర్ ఆకస్మిక మరణం అందరినీ ఎంతగానో కలిచివేసింది. నిన్నటి వరకు తన ఆట, పాటలతో అలరించిన గద్దర్‌కు ఘన నివాళులర్పించింది ఆర్టీవీ, తొలివెలుగు. కవులు, రచయితలు, ఉద్యమకారులు ఇలా ఎందరినో ఒక చోటకు చేర్చి.. గద్దరన్నతో వారందరి అనుబంధాలను సమాజానికి తెలిపే ప్రయత్నం చేసింది ఆర్టీవి, తొలివెలుగు.
గద్దర్‌తో కలిసి అడుగులేసిన ఎందరో కళాకారులు, గాయకులు, కవులు, రాజకీయ ప్రముఖులు సంస్మరణ సభలో పాల్గొన్ని.. గద్దర్‌తో తమ అనుభవాలు, అనుభూతులను గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సహచరిణి విమలక్క, గోరటి వెంకన్న, ఆర్ నారాయణమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అద్దంకి దయాకర్, ఏపూరి సోమన్న, జయరాజ్, మానుకొట ప్రసాద్, గెడ్డం సతీష్, పుష్పక్క.. ఇలా ఒకరేంటి.. ఆయనతో పరిచయం ఉన్న కళాకారులంతా ఒకే చోటకు చేరి.. ఆట పాటలతో గద్దర్రు నివాళులర్పించారు.
ప్రజాకవి గద్దర్‌ను స్మరిస్తూ ఏపూరి సోమన్న పాడిన పాటకు.. గోరటి వెంకన్న ఆడుతూ అందరినీ అలరించారు. దోపిడీ రాజ్యం పోవాలని, పేదల బతుకుల్లో వెలుగులు నిండాలని జీవితాంతం పోరాటం చేసిన యోధుడు గద్దర్‌ను సమాజం కోల్పోయిందంటూ బాధాతప్త హృదయాలతో శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ ఓ సామాన్య వ్యక్తి కాదు.. సమాజాన్ని కదిలించిన ఓ శక్తి.. ఆయన పాట వింటుంటే ఒళ్లు పులకరించిపోవల్సిందేనంటూ ప్రతి ఒక్కరూ తమ అనుభూతులను చెప్పుకొచ్చారు. అవతలివాడు ఎంతటివాడైనా.. ఎదురొడ్డి నిలబడి.. అణగారిన వర్గాల బతుకులు బాగుపడటం కోసం పరితపించిన యోధుడంటూ గద్దర్ గొప్పతనాన్ని చెబుతూఉంటే.. ఎంత గొప్ప మనిషిని ఈ సమాజం కోల్పోయిందంటూ ప్రతి ఒక్కరూ తమ బాధను వెల్లగక్కారు. గద్దర్ భౌతికంగా లేకపోయినా.. ఆయన మాట, ఆట, పాట, ఆశయం మనతోనే శాశ్వతంగా ఉంటుందంటూ.. నివాళులర్పించారు.
గద్దర్ ఆశయం నెరవేరేవరకు.. కళాకారులంతా పోరాడాలి వక్తలు పిలుపునిచ్చారు. ప్రజా యుద్ధ నౌక ఇచ్చిన స్ఫూర్తి కలకాలం నిలిచే ఉంటుందని, ఆయన ఆశయాలు కొనసాగించడమే గద్దర్‌కు అర్పించే నిజమైన నివాళులని చెప్పారు. గద్దర్ మన మధ్య లేకపోయినా.. ఆయన పాటలను తికించాలని.. అందుకోసం ఓ పాటల మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కళాకారులు ప్రతిపాదించారు. కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు గద్దర్ మనమధ్యలోనే ఉండి ఆస్వాదిస్తున్నాడనే అనుభూతి కలిగింది. గద్దర్ వెళ్తూ వెళ్తూ.. ఎంత మంది గద్దర్‌లను తయారుచేశాడో.. ఆర్టీవీ సంస్మరణ సభ ద్వారా ప్రజల కళ్లకు కట్టినట్లు కనిపించింది. ప్రతి ఒక్కరూ జోహర్ గద్దరన్న అని నినదిస్తూ.. ఆ ప్రజాకవికి ఘన నివాళులర్పించారు.
వీల్‌చైర్‌పై రాజ్యసభకు మన్మోహన్ సింగ్.. సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్‌ని తిట్టిపోస్తున్న బీజేపీ!
అది రాజ్యసభ..అర్థరాత్రి కావొస్తోంది.. ఢిల్లీ సర్వీస్ బిల్లుపై రచ్చ రచ్చ జరుగుతున్న సమయం. విపక్షల మాటలకు కౌంటర్లుగా హోం మంత్రి అమిత్‌షా(amit shah) అప్పటివరకు ప్రసంగించారు.. విమర్శలకు సమాధానమిస్తూ తనదైన శైలిలో రెచ్చిపోయారు. సర్వీసు బిల్లు(delhi service bill)కు మద్దతుగా ఎన్డీయే పార్టీలు.. వ్యతిరేకంగా INDIA కూటమి పార్టీలు ఓటింగ్‌కి సిద్ధమయ్యాయి. ఇంతలోనే ఓ 90ఏళ్ల పెద్దాయన.. వీల్‌చైర్‌లో సభలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఆయన అంకితభవానికి సభలో ఉన్నవాళ్లంతా, పార్టీలకతీతంగా ఫిదా అయ్యారు. దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన.. 2008 ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడారు. 1991లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాన్ని తన సంస్కరణలతో ముందుకు తీసుకెళ్లారు. దేశానికి ఇన్ని చేసిన మన్మోహన్ సింగ్(manmohan singh) 90ఏళ్ల వయసులోనూ తన బాధ్యతను మరిచిపోలేదు. ఆరోగ్యం బాగాలేకున్నా.. ఢిల్లీ సర్వీసు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సభకు రావడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అందుకే బీజేపీ కూడా ఈ విషయంలో మన్మోహన్ సింగ్‌ని మెచ్చుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌ని ఇరుకున పెట్టేలా కూడా బీజేపీ మాటలదాడి చేసింది.
బీజేపీ అటాక్:
90 ఏళ్ల మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరుకావడం ప్రతిపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
కాంగ్రెస్ ఒక్క ఓటు కక్కుర్తి కోసం ఆరోగ్యం బాగోని మన్మోహన్ సింగ్‌ని సభకు వచ్చేలా చేసిందని బీజేపీ మండిపడుతోంది. ఓవైపు మన్మోహన్ సింగ్ అంకితభావాన్ని కొనియాడుతూనే మరోవైపు కాంగ్రెస్‌ని ఏకిపడేసింది. కాంగ్రెస్ పిచ్చిని దేశం గుర్తుంచుకుంటుందంటూ ఫైర్ అయ్యింది. ఇలాంటి ఆరోగ్య పరిస్థితిలో కూడా ఒక మాజీ ప్రధానిని పార్లమెంటులో అర్థరాత్రి వీల్‌చైర్‌పై కాంగ్రెస్ కూర్చోబెట్టిందంటూ విరుచుకుపడింది బీజేపీ. అది కూడా ఒక నిజాయితీ లేని కూటమిని బతికించుకోవడం కోసం రెస్ట్ తీసుకోవాల్సిన మన్మోహన్ సింగ్‌ని సభకు రప్పించారని..ఇది చాలా సిగ్గుచేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కాంగ్రెస్ ఏం చెబుతోంది?
బీజేపీ విమర్శలను కాంగ్రెస్, ఆప్, INDIA కూటమి మిత్రపక్ష నేతలు తిప్పికొట్టారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసానికి మన్మోహన్ సింగ్ నిదర్శనమని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధతకు ఇది సాక్ష్యమన్నారు. అటు సోషల్‌మీడియాలోనూ నెటిజన్ల నుంచి మన్మోహన్ సింగ్‌కు భారీ మద్దతు లభిస్తోంది. ఈ వయసులో ఓటు వేయడానికి ఆరోగ్యం బాగోకున్నా వచ్చిన మన్మోహన్ సింగ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొంతమంది ఎంపీలకు కనీసం పార్లమెంట్‌కి రావాలన్న బుద్ధి కూడా ఉండదని.. వారంతా మన్మోహన్సింగ్ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది.
ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు RTV నివాళి.. లైవ్..!
Rtv Tribute to poet Gaddar : వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ఆర్టీవీ నివాళులర్పిస్తోంది. గద్దర్‌పై తమకున్న ప్రేమను చూపిస్తోంది. అశేష జనసందోహం నిన్న గద్దర్‌కి కన్నీటి నివాళులర్పించింది. కడసారిగా గద్దర్‌ను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు ఉద్యమ వీరుడికి నివాళులు అర్పించారు.
గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో గత జూలై-20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు-3న బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారు.
మంత్రి అంబటికి ఇచ్చిపడేసిన చిరు.. మెగాస్టార్ ఏమన్నారంటే..?
Chiranjeevi hot comments on YCP Minister Ambati Rambabu: పరోక్షంగా మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు చురకలంటించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). వాల్తేరు వీరయ్య(Waltair veerayya) 200 డేస్ ఫంక్షన్లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడాలంటూ కౌంటర్లు వేశారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని.. పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించడంపై దృష్టి పెట్టాలంటూ పరోక్షంగా మంత్రి అంబటికి సెటైర్లు వేశారు. ఇలా చేస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని.. అసలు విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ ఇండస్ట్రీపై పడతారేంటంటూ ప్రశ్నించారు చిరు. ఇదేదో పెద్ద సమస్యల చూపించొద్దని. ‘బ్రో'(Bro) సినిమాపై అంబటి వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్లు విసిరారు మెగాస్టార్.
మెగా ఫ్యాన్స్ ఆనందం?
రాజకీయాలకు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్న చిరంజీవి ఇటివలి కాలంలో తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తమ్ముడికి అండగా చిరు నిలబడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది మెగా ఫ్యాన్స్ ఆనందానికి కారణమవుతుంది. ఇక ఇటివలి మంత్రి అంబటి వర్సెస్ పవన్ కల్యాణ్ ‘బ్రో’ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘బ్రో’ సినిమాలో తన గురించే ఓ సీన్ పెట్టారని అందుకే మాట్లాడాల్సి వస్తోందంటూ ఫైర్ అవుతున్నారు అంబటి. తనను కించపరచాలనే బ్రో సినిమాలో పవన్.. శ్యాంబాబు క్యారెక్టర్‌ను పెట్టాడని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. అసలు పవన్(Pawan Kalyan) రెమ్యూనరేషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పలేని వ్యక్తి రాజకీయాల్లో పారదర్శకత ఎలా చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రచ్చ కాస్త ఢిల్లీ వరకు వెళ్లింది. ‘బ్రో’ సినిమా పెట్టుబడులపై దర్యాప్తు చేయమని ఢిల్లీ వరకు వెళ్లారు అంబటి.
మెగా ఫ్యాన్స్ వర్సెస్ అంబటి:
రాజకీయంగా పవన్‌కు వైసీపీ బద్ద శత్రువు. వైసీపీ మంత్రులు పవన్‌ని టార్గెట్ చేయడం ఇదేం మొదటి సారి కాదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటారు వైసీపీ నేతలు. ఈసారి ‘బ్రో’ సినిమా విషయంలో ఈ రచ్చ మొదలైంది. సోషల్‌మీడియాలో చాలా రోజులుగా వైసీపీ మద్దతుదారులు, పవన్ ఫ్యాన్స్ గొడవపడుతున్నారు. ఇక ‘బ్రో’ మూవీతో పాటు సినీ పరిశ్రమపై అంబటి వ్యాఖ్యలను ఇండస్ట్రీ పెద్దలు కూడా తప్పుపడుతున్నారు. అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌ను గాలి మాటలుగా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ కొట్టిపడేశారు. ఇక వైసీపీ మంత్రులు పదేపదే హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతుండడం ఇండస్ట్రీ పెద్దలకు నచ్చడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చిరు చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా తమపై ఎందుకు పడుతున్నారని చిరు చేసిన కామెంట్స్ వెనుక కారణం అదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read: అన్నయ్య మంచోడు.. తమ్ముడు మొండోడు..:హైపర్ ఆది
అవిశ్వాసతీర్మానంపై లోక్ సభలో కీలక చర్చ
Rahul To Deliver his Speech on No Confidence Motion : 3 నెలలకు పైగా మణిపూర్ తగలబడిపోతోంది. మహిళల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు కొందరు దుండగులు. ఆ అరాచకంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. మరోవైపు మణిపూర్ (Manipur) హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు విపక్ష కూటమి ఇండియా సభ్యులు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అవిశ్వాస తీర్మానమిచ్చారు. దీనిపై కాసేపట్లో చర్చ జరగనుంది.అధికార NDA, విపక్ష INDIA కూటముల మధ్య లోక్‌సభలో వాడివేడి మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది.
ఇక సుప్రీంకోర్ట్ తీర్పుతో ఎంపీ సభ్యత్వాన్ని తిరిగిపొందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నారు . మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంతో పార్లమెంట్లో రాహుల్‌గాంధీ కీలక ప్రసంగం చేయనున్నట్టు తెలుస్తోంది. ఐతే మూడ్రోజుల పాటు జరిగే చర్చలో చివరి రోజు అంటే..గురువారం ప్రధాని మోదీ..మణిపూర్ ఘటనపై సమాధానమివ్వనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచి మణిపూర్ ఘటనలపై ప్రధాని స్పందించాలంటూ పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. ఐతే అధికార పక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉభయసభల్లోనూ వాయిదాల పర్వం నడిచింది. చివరికి.. జులై 26న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది విపక్షం. ఈ ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం పోయిందని, దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఇలాగైనా మోదీ మణిపూర్ ఘటనపై మాట్లాడతారని భావిస్తోంది. మరోవైపు విపక్షాల ఆందోళనల మధ్యే..ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకుంది.
అయితే.. ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని ఇండియా కూటమి చెబుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ అవిశ్వాస తీర్మానం.. అటు అధికారపక్షానికి, ఇటు విపక్షానికి కీలకంగా మారింది. ఇందులో నెగ్గి బీజేపీ తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. అదే సమయంలో ప్రజల నుంచి మద్దతు పొందేందుకు ఇది మంచి అవకాశం అని కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఢిల్లీ సర్వీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఎన్డీఏ కూటమికి 131ఓట్లు
బ్రిడ్జ్ పైపు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న సాహస బాలిక
గుండె నిండా ధైర్యం ఉప్పొంగింది. ఎలాగైనా బతకాలనే ఆశ ఆమెలోని సమయస్ఫూర్తిని బయటకు తీసేలా చేసింది. కళ్లముందే తల్లి, చెల్లి మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నా.. తండ్రి లాగా భావించిన వ్యక్తే యముడై తనను కాటికి పంపాలనుకున్నా.. ఆ బాలిక మాత్రం వణకలేదు. చుట్టూ అంధకరమే అలుముకున్నా.. కను చూపు మేరలో సాయం చేసే నాథుడే కనపడకున్నా ఆమె బెదరలేదు. బతకాడానికి కావాల్సింది డబ్బు కాదని.. ధైర్యముంటే మృత్యువుని కూడా జయించవచ్చని నిరూపించిందామె. చిన్నచిన్న సమస్యలకే ఊపిరి వదులుతున్న వారికి స్ఫూర్తి నింపేలా ఆ బాలిక చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి యావత్ దేశ ప్రజలను సలామ్ కొట్టేలా చేసింది. ఇప్పుడా బాలిక టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ కాదు.. టాక్ ఆఫ్ ది కంట్రీ..! అవును..! మన రాపులపాలెంలో జరిగిన ఓ ఘటనను హిందీ మీడియా కూడా హైలెట్ చేస్తుందంటే ఆ బాలిక ఏం చేసిందో మీరంతా తెలుసుకోవాల్సిందే!
తండ్రి అనుకుంటే..!
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పుప్పాల సుహాసిని(36) భర్తతో గొడవల కారణంగా విడిపోయి దూరంగా ఉంటోంది. కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తోంది. ఆమెకు కిర్తన అనే పాప కూడా ఉంది. ప్రస్తుతం కీర్తన 13ఏళ్ల బాలిక. ఇక భర్తతో విభేదాలు పెరగడంతో విడాకులు తీసుకున్న సుహాసినికి రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్(30)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారి తీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సుహాసిని(suhasini), సురేశ్(suresh) పిల్లలతో కలిసి ఉంటున్నారు. సురేశ్‌తో సహజీవనం కారణంగా వీరిద్దరికి జెర్సీ (1) జన్మించింది. ఇప్పటివరకు అంతాబాగానే ఉన్నా ఇంతలోనే సురేశ్ తన రియాల్టిని బయటకు తీశాడు. ఎలాగైనా సుహాసినిని వదలించుకోవాలనుకున్నాడు. తరుచుగా సుహాసినితో గొడవ పడడం మొదలుపెట్టాడు. అయినా ఆమె సురేశ్‌ని వదలలేదు.

ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని:
సుహాసినికి మంచి చెప్పినా.. గొడవ పడినా మాట వినడం లేదని గ్రహించిన సురేశ్.. ఆమెతో పాటు పిల్లలను కూడా అంతమొందించాలని ఫిక్స్ అయ్యాడు. సరదాగా బయటకు వెళ్దామని చెప్పి తాడేపల్లి నుంచి రాజమండ్రి తీసుకువెళ్లాడు. రాత్రంతా అక్కడే తిప్పాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి నమ్మించాడు. సుహాసిని, పిల్లలు కూడా అంగీకరించడంతో వారందరిని రెయిలింగ్ దగ్గర పిట్టగోడపై నిలబెట్టాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ముగ్గురిని నదిలోకి తోసేశాడు. ఆ తర్వాత కారు తీసుకుని పారిపోయాడు.

సెల్యూట్ కీర్తన:
జీవితంలో అందరికంటే ఎక్కువగా సురేశ్‌ని నమ్మిన సుహాసిని గోదావరిలో పడిపోయింది. వాళ్లద్దరికి జన్మించిన జెర్సీ కూడా నదిలో కొట్టుకుపోయింది. అయితే 13ఏళ్ల కీర్తనkeerthana) మాత్రం.. గోదావరిలో పడలేదు. సురేశ్ అలా తోసి..వెంటనే వెళ్లిపోయాడు. రెయిలింగ్‌కి ఆనుకోని ఉన్న ఓ పైపును గట్టిగా పట్టుకోని ఉండిపోయింది కీర్తన. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు.. ‘హెల్ప్.. హెల్ప్’ అని చాలా సేపు అరిచింది. ఇంతలోనే తన జేబులో ఫోన్ ఉన్న విషయం గుర్తుకొచ్చింది. అప్పటికీ పైపును గట్టిగా రెండు చేతులతో పట్టుకోని ఉన్న కీర్తన.. జేబులో నుంచి ఫోన్ తీసుకోవాల వద్ద అని కాసేపు ఆలోచించింది. ఇప్పుడు ఫోన్ తీయ్యకపోతే తన ప్రాణాలు కచ్చితంగా పోతాయని.. ఎక్కువ సేపు ఇలా పైపును పట్టుకోని ఉండలేనని ఫిక్స్ అయిన కీర్తన.. ఒక చేతితో పైపును పట్టుకుంటూనే మరో హ్యాండ్‌తో ఫోన్ తీసి.. ‘100’కి డయాల్ చేసింది. పోలీసులకు జరిగినదంతా చెప్పింది. వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు కీర్తనను కాపాడారు. మృత్యువు ఒడిలోకి చేరుతుందనుకున్న కీర్తన ఆఖరి నిమిషంలోనూ ధైర్యాన్ని చూపి బతికింది. కీర్తన ధైర్యం, సమయస్ఫూర్తిని చూసి ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. మరోవైపు నిందితుడు సురేశ్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.











