Sarala Kumari: సిక్కిం రాష్ట్రంలో ఇటీవల కుంభవృష్టి వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 14 మంది మృతి చెందగా.. మరో 26 మంది గాయపడ్డారు. 22 మంది జవాన్లు సహా మొత్తం 102 మంది గల్లంతైయ్యారు. అయితే, ఆ వరదల్లో ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి గల్లంతైనట్టు తెలిసింది. దానవీరశూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ఇటీవల స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఆ రాష్ట్రంలో వచ్చిన ఆకస్మిక వరదల తర్వాత ఆమె ఆచూకీ గల్లంతైంది. తల్లి ఆచూకీ లేకపోవడంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న సరళ కుమారి అక్టోబర్ 2న స్నేహితులతో కలసి సిక్కిం పర్యటనకు వెళ్లినట్టు ఆమె కుమార్తె చెప్పారు. అక్కడ ఓ హోటల్ లో బస చేసినట్టు తెలిపారు. చివరిగా ఈ నెల 3న అమ్మతో ఫోన్ లో మాట్లాడానని, ఆ తర్వాత అమ్మతో సమాచారం లేదంటూ నబిత వెల్లడించారు. ‘‘వరదలు వచ్చినట్టు వార్తలు చూసి తెలుసుకున్నాను. ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసినప్పటికీ కలవడం లేదు’’ అని నబిత ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు. 1983 సంవత్సరంలో మిస్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికైన సరళా కుమారి.. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. దానవీర శూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు.
Also Read: స్టార్ యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్..!











